పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0333-4 పాడి సంపుటం: 11-196

పల్లవి: మతకాలు నేరిచినమాయదారివి
         తతి నీ వడ్డము రాక తలరా వోరి

చ. 1: దవ్వుల నే రాఁగానె తగఁ బలుకరించేవు
       యెవ్వతెకు నా రాక యెచ్చరించేవో
       అవ్వల నప్పటనుండి అనుమాన మయ్యీ నాకు
       పవ్వళించే లోను చూచేఁ బదరా వోరి

చ. 2: యింతట నేఁ జొచ్చి రాఁగా నెదురుగా వెళ్లి వచ్చే
       వంత నాకె గోపగించీ నంటానో వోరి
       యెంతైన నీవు నన్ను నేమరించఁ జోటు లేదు
       చెంత నెవ్వతెఁ దెచ్చితి చెప్పరా వోరి

చ. 3: చేరి నే మంచ మెక్కఁగా చెలులనే పిలిచేవు
        వారిలో నాపెఁ గలుపేవగలా యివి
        యేరా శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
        తేరెఁ బను లింక తెర దియ్యరా వోరి