పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0333-1 ధన్నాశి సంపుటం: 11-193

పల్లవి: నేనైతే నేమీ నెరఁగ నీకు నీవే బెదరేవు
         తానే బయటఁ బడీని తగని నీచేఁతలు

చ. 1: కొండవంటి దొర నిన్నుఁ గోరి వెంగె మాడుదునా
       దుండుగము నీకు నీకే తోఁచీఁ గాకా
       అండకు వచ్చి నీ గట్టు అరయఁగ వచ్చితినా
       వుండుండి నీకు నీవే వులికేవు గాక

చ. 2: నడుమను నిన్నుఁ జూచి నవ్వులు నవ్వితివా
       వడి నీకు నీవే తల వంచేవు గాక
       వెడ నీ మేనిచేఁతలు వెదకి చూచితినా
       తడవి కప్పుక నీవే దాఁచేవు గాక

చ. 3: నీవు గాఁగిలించుకోఁగా నేరము లెంచితినా
       భావించ నీవే సిగ్గు వడేవు గాక
       యీవేళ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
       కోవిదుఁడ వై రతిఁ గొంకేవు గాకా