పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0332-4 శ్రీరాగం సంపుటం: 11-190

పల్లవి: వలసితే రేపు మాపు వచ్చేవు గాని
         అలమి చే యెత్తి మొక్కి అంపించుక రావె

చ. 1: యేడ లేనిమాఁటలు యెందాఁక నైనఁ బెనచి
       ఆడెవు మాఁటలు నీవు అతనితోను
       తోడ నంపించుక రావె తుద లేదీ యాసలకు
       నీ డనపు యెం డనవు నిలుచుండే వీడను

చ. 2: కూరి మెల్లఁ బెట్టి పెట్టి కొనచూపు నాఁటఁ జూచి
       ఆరగించఁ బోఁ జాల వాతనిఁ బాసి
       యీ రీతి నింత గలితె యింటి కైనాఁ దోడి తేవె
       తీరవు మీ ముచ్చటలు దీవెత్తుఁబొద్దాయను

చ. 3: గయ్యాళి వై నవ్వి నవ్వి కాఁగిట బింగించుకొని
       యెయ్యెడఁ బోనీవు యేమే యితని
       నెయ్యపు శ్రీవెంకటేశు నీవుఁ గూడితివి ఆతఁ
       డియ్యడనె వుండీఁ గాని యిల్లు వెళ్ల నీకువే