పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0332-3 శంకరాభరణం సంపుటం: 11-189

పల్లవి: దొరతో సంగాతము దొరకినపాటే చాలు
         వొరసి మీరఁగఁ బోతే నొక్క రీతి నుండునా

చ. 1: యేకతాన లోన నుండి యేల నన్నుఁ బిలిచేవు
       వాకిటికి రావయ్య వలసితేను
       చేకొని యొకతె యుంటె సిగ్గుపడి వెళ్లి వచ్చి
       కూకులు వత్తులు గాను కూళదాననా

చ. 2: మరిగించి మరఁగున మాట లే లాడించేవు
       తెర దియ్యవయ్య అంత తీఁట గలితె
       వరుసకు వచ్చినాపె వాదు నాతోఁ బెట్టుకొంటె
       విరస మై యూరకుండ వెఱ్ఱిదాననా

చ. 3: పట్టెమంచముపై నుండి పైఁ గాలు చాఁచ నేల
       యిట్టె వుర మెక్కవయ్య యింత గలితె
       జట్టిగా శ్రీవెంకటేశ సరి నొకతె గూచుంటె
       వట్టి యితపు సేసుకో వాసి లేనిదాననా