పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0331-6 శ్రీరాగం సంపుటం: 11-186

పల్లవి: నన్నుఁ బాసి వుండ నేల నాయాలకు రా నేల
         వున్నట్లానె వుంటే వొరసేరా నిన్ను

చ. 1: కాంతలఁ దిట్టఁగ నేల కాని కాని వొట్లేల
       యింతట నీ గుణము నే నెఱఁగనిదా
       పంతపుసాకిరు లేల పతితారుకాణ లేల
       వంతన నా వద్ద నుంటే వచ్చీనా నిందలు

చ. 2: పదరి కోపించ నేల బాసలు సేయఁగ నేల
       కదిసి నీ మోహము నేఁ గన్నదె కాదా
       వదరుఁబెదవు లెండ వాదు లడువఁగ నేల
       అదన నావద్ద నుంటే ఆడేరా నిన్నును

చ. 3: నే నెంతైనా నమ్మ నంటా నీకె యలుక లేల
        కానీ లేరా యిన్నియు నేఁ గన్నవె కావా
        పూని శ్రీవెంకటేశుఁడ వొడఁబరచి కూడితి
        నేను నీవూ నిట్టె వుంటే నేఁ డనేరా నిన్మునూ