పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0331-5 నాగవరాళి సంపుటం: 11-185

పల్లవి: ఎట్టున్నదో నీ మనసు యేమి సేతురా
         యెట్ట నెదుటఁ బాయ లే నేమి సేతురా

చ. 1: చూచుదాఁకా వేగిరింత సొంపుగా విభుఁడ నీతో
       దాఁచి మాటాడినదాఁకఁ దమకింతును
       చేచేతఁ దమకింతు చేరువదాఁకా నిట్లనె
       యేచి తమకమే నిండె నేమి సేతురా

చ. 2: అట్టె నీ చెనకులకు నాసగింతుఁ దనివోక
        ముట్టి యాసగింతు నీ మోవితేనెకు
        గట్టిగా నంతటిమీఁద కాఁగిటికి నాసగింతు
        యెట్టైనా నాసలే నిండె నేమి సేతురా

చ. 3: అదన‌ నీ మే నంటి అట్టె పరమశ మవుదు
       వదలక కూడి పరవశ మవుదును
       పొదలి శ్రీవెంకటేశ పొందితిని నన్ను నిట్టె
       యెదిరించెఁ బరవశా లేమి సేతురా