పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0331-2 పాడి సంపుటం: 11-182

పల్లవి: ఎంత గట్టువాయతనమి దేమే వీఁడు
         అంతకంత కేమన్నా నస మీఁడే వీఁడు

చ. 1: నిద్దుర కన్నులఁ దేరి నీకంటే లే దంటా
       గద్దించి తప్పక చూచీఁ గదే వీఁడు
       ముద్దుతో నెగసక్కేల మోవికెంపులు రేఁచితే
       వొద్దన లేక వోరిచి వున్నాఁడె వీఁడు

చ. 2: ముక్కున నూర్పులు నీకు ముంచె నంటె లే దంటా
        అక్కిలించి లోనోనె ఆఁపీనె వీఁడు
        అక్కడ నలసి వచ్చే నందుపై నేఁ బెనఁగితె
        అక్కరతో రతులకై ఆసపడీ వీఁడు

చ. 3: చెమటలు తన మేను చెరఁగునఁ గప్పీతేను
       అమర ముసుఁగు వెట్టీ నప్పటి వీఁడు
       తమితో శ్రీవెంకటేశుఁ దగ నిందుకె మెచ్చితే
       భ్రమసినట్లఁ బైపైఁ గూడీ వీఁడు