పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0330-5 కాంబోది సంపుటం: 11-179

పల్లవి: చింతలఁ జిగురులు చెనకులఁ జేఁగలు
         వంతల నీ చలుములు వద్ద యిఁకను

చ. 1: చెలి నీ సిగ్గు లివిగో సెలవి వెన్నల గాయ
       యెలమి బొమ్మలజంకె యెండ గాసీనె
       వలచి విభుఁ డిందుకే వాడుచు వాడుదేరీని
       కలువ చూపు లయినఁ గప్పవే మీఁదను

చ. 2: మాటలతేనెలోన మధురము గురియఁగ
        గాఁటపు నీ బిగువులు కార మయ్యీనె
        వీఁటనె విభుఁ డిందుకు వీఁగీని లోఁగీని
        పాటల రాగాల చిలుపా లైనఁ బోయవే

చ. 3: కాంత నీ కాఁగి‌ లనేటి కమ్మఁబూఁదీగెఁ బొదిగీ
       యింత నీ ముండ్లగోళ్లనేల వొత్తేవే
       పంతపు శ్రీవెంకటాద్రిపతి యిట్టె నన్నుఁ గూడె
       అంతలో మెత్తనివినయము లైనఁ జేయవే