పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0330-4 శ్రీరాగం సంపుటం: 11-178

పల్లవి: కొత్త పెండ్లికూఁతురు కొంకు దేరీఁ దేరదు
         చిత్తగించి నీ వైనాఁ జేయి వట్టవయ్యా

చ. 1: చిమ్ముచు నీ మోము చూచీ సిగ్గుతో దగ్గరదు
       కొమ్మసంగడి నీ వైనఁ గూచుండవయ్యా
       కమ్మి నవ్వులును నవ్వీఁ గలసి మాటలాడదు
       పమ్మి నీ వైన నాపెతోఁ బలుకవయ్యా

చ. 2: ఆలవట్టము విసరే నంటి ముట్టి పెనఁగదు
       తేలించి యాపె వెరపు తెలపవయ్యా
       కాలు దొక్కీ నిన్ను నిట్టె కాఁకదేరఁ గలయదు
       పోళిమి నీవే కాఁగిటఁ బొదుగవయ్యా

చ. 3: తనలోనె మోహించీ దంటతనము నేరదు
        ననుపులే యాకెతోడ నడపవయ్య
        యెనసె శ్రీవెంకటేశ యింతినిన్ను మెల్లనె
        మన సిచ్చి యిటులానె మన్నించవయ్యా