పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0329-3 వరాళి సంపుటం: 11-171

పల్లవి: పలుమారుఁ బెనఁగక పదవే నీవు
         నిలుచున్నాఁ డెదుటనే నీ కెంత పగటే

చ. 1: నెట్టుకొని రమణుఁడు నిన్నే తప్పక చూచీ
       పట్టినచలము మాని పదవే నీవు
       అట్టె దొర యాఁతడు నిన్నడిగే మాటల కెల్ల
       యెట్టైన నుత్తర మియ్య వెంత గుండే నీకు

చ. 2: చేపట్టి పెనఁగీని చెలువపు నీ విభుఁడు
       పైపయిఁ దప్పించుకోక పదవే నీవు
       యేపున నాతఁడె నీయింటికి వచ్చి యుండఁగా
       కోపము మానవు యేటి కొత్తలే నీవూ

చ. 3: చింత దీర నాతఁడు చిరునవ్వు నవ్వఁగాను
        పంతాలు చెల్ల దింకఁ బదవే నీవూ
        అంతలో శ్రీవెంకటేశుఁ డాదరించి నిన్నుఁ గూడె
        యెంతటిదానవు నీవు యెదు రేదే నీకు