పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0329-1 ఆహిరి సంపుటం: 11-169

పల్లవి: ఇంతి యలిగితేఁ గన యెవ్వరి వసము గాదు
         సంతసాన నవ్వేటి సతితోడ నగవూ

చ. 1: యెక్కడ పరాకో యేమి భావించేవో
       మొక్కేటిచెలిఁ గాఁగిట ముంచి యెత్తవు
       మక్కువ నీకుఁ జాలదో మనసులోఁ గోపమో
       నిక్కి చూచేసతితోడ నీ వేమీ ననవూ

చ. 2: సిగ్గు పడ్డ విధమో చెప్పేవారు లేకో
        దగ్గరి యున్నసతితోఁ దమకించవు
        నిగ్గుల రాజసమో నీ వొళ్లిగుణమో
        వెగ్గళించి పిలువఁగ వినియును వినవూ

చ. 3: యేమి దలఁచుకొంటివో యీ వనిత భాగ్యమో
        చే ముంచి సరస మాడి చెక్కు నొక్కేవు
        కాముఁడు పెర రేఁచెనో కరుణ నీకుఁ బుట్టెనో
        నేమపు శ్రీవెంకటేశ నీవే కూడితివి