పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0328-2 సాళంగనాట సంపుటం: 11-164

పల్లవి: దేవ నీ చెలువములోఁ దిరమై మిక్కిలి నీ
         దేవి చెలువము దెచ్చెఁ దేటతెల్లమిగాను

చ. 1: గరిమ నీ వురము కౌస్తుభమాణికముతో
       సరి దూఁగి యెక్కు డాయ సతీమణి
       వరుస నీదు బాహువల్లుల నడుమను
       పెరిగి నీ లలితాంగి పెద్దరిక మందె

చ. 2: నీలమేఘమువంటి నీ మేనికాంతికి
        మేలిమివన్నె దెచ్చె మెరుఁగుఁబోఁడి
        పోలింప నీదు తమ్మిబొడ్డుకంటెఁ బొడవున
        కాలు దొక్కి నిలిచెను కమలాలయ

చ. 3: అదివో నీ బంగారుహరముల నడుమను
        పొదిబంగా రై నిలిచె పుత్తడిబొమ్మ
        పొదిగి శ్రీవెంకటేశ భోగించె నీ కాఁగిటికి
        అదనఁ బుట్టుభో గాయ నలమేలుమంగ