పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0328-1 మధ్యమావతి సంపుటం: 11-163

పల్లవి: చెనకితే బిగియఁగ జెల్లదా నేఁడు
         జినుగుసిగ్గుల నవ్వు చెల్లదా నీకూ

చ. 1: కాయ మట పాయ మటు కడు వలచితి నట
       నేయఁగల ట్టెల్ల నీకు జెల్లదా నేఁడు
        నాయంతనె వచ్చెనా నాతుల కిదె చాలు
        చేయ మీఁ దాయను నేఁడు చెల్లదా నీకు

చ. 2: కలి మట బటి మట కదిసి నవ్వే వట
        చెలఁగి నే వే మన్నఁ జెల్లదా నేఁడు
        చల మెన్నఁటికె యిఁక సాదించవలెఁ గాక
        చెలరేఁగి మాటలాడఁ జెల్లదా నీకు

చ. 3: యిల్లట మంచ మట యేకత మిదే యట
        చెల్లఁబో యేమి సేసినఁ జెల్లదా నేఁడు
        కొల్లగా శ్రీవెంకటేశ కూడితివి నన్ను నిట్టే
        చిల్లరపొందులు మానఁ జెల్లదా నీకూ