పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0326-1 సాళంగనాట సంపుటం: 11-151

పల్లవి: రచ్చలఁ బెట్టక యిట్టే రావయ్యా
         గచ్చులు మాని యిన్నీఁ గనుకోవయ్యా

చ. 1: పంతము దప్పదు నీతో బలికినమాత్రమున
       వంతుకుఁ జెలి కిందులో వాసి వోదు
       యింతిచేత నేఁ జెప్పించే యెడమాట లీడ నేల
       వింతల నీ సుద్దు లిందే వినుకోవయ్యా

చ. 2: సూటి దప్ప దింతలోనే చూచిన మాత్రమున
       ఆఁటదాని కిందుకుఁగా నాస వోదు
       కూటమి నాపెచేత గురుతులు పట్టింపించే
       దీఁట నైనా నాచేఁతలు తెలుసుకోవయ్యా

చ. 3: ఘనత లేమీఁ దప్పదు కాఁగిలించినంతలోనే
        పెనఁగించె ఆపెచేత పెరిమె వోదు
        చెనకి కూడితి విట్టే చేరి శ్రీవెంకటేశుఁడ
        మన సిచ్చి రక్షించి మన్నించుకోవయ్యా