పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0325-6 భైరవి సంపుటం: 11-150

పల్లవి: తొల్లో నీకంటే నే దొడ్డదానవా
         బల్లిదుఁడ నీవె నన్ను పాలింతువు గాకా

చ. 1: చిత్తము రా నీకు నే సేవ సేయఁ గలనా
        సత్తగు నీ దయ నాపైఁ జల్లుదు గాక
        నిత్తెము నిన్ను మెప్పించ నేరుతునా యే మైనా
        కొత్తగా నన్నిట్టే దిద్దుకొందువు గాకా

చ. 2: యిట్టి దని నీ మహిమ యెరుఁగుదునా నేను
        నెట్టన బుద్ది చెప్ప మన్నింతు గాకా
        వొట్టి నీకు విన్నవించ నోపఁ గలనా నేను
        వట్టి నీవే తెలుసుక పయికొందువు గాకా

చ. 3: కందువ లెరిఁగి నిన్ను కాంగిలించఁ గలనా
       అందాలు సేసుక నీవే అంటుదు గాక
       యిందుకే శ్రీవెంకటేశ యియ్యకొని కూడితివి
       మందలించఁ గలానా మరుగుదు గాకా