పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0325-2 ముఖారి సంపుటం: 11-146

పల్లవి: తమకించఁ దన కేలే తానే నేను
         సమకూడేదానఁ గాక సాదించేదాననా

చ. 1: చేసన్న చేసితి నింతే చెక్కులు నొక్కితి నింతే
       వాసులు వంతుల కేల వచ్చీనె తాను
       రాసి కెక్కె తనమేలు రచ్చ కెక్కె చేఁత లెల్ల
       ఆసపడేదానఁ గాక అడ్డ మాడేదాననా

చ. 2: కన్నుల నవ్వితి నింతే కాయము సోఁకితి నింతే
       పన్నినవొరపు లే పట్టీనె తాను
       యెన్ని కాయఁ దనపొందు యిర వాయఁ గోరికలు
       మన్ననలోదానఁ గాక మారుకొనేదాననా

చ. 3: సిరసు వంచితి నింతే చేతుల మొక్కితి నింతే
       కెరలి నన్నేల గిలిగించీనె తాను
       యిరవై శ్రీవెంకటేశుడిన్నిటాను నన్నుఁ గూడె
       పెర రేఁచేదానఁ గాక బిగిసేటిదాననా