పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0323-5 ఆహిరి సంపుటం: 11-137

పల్లవి: వలపులె కాండి పారి వరుస నిద్దరికిని
         నిలవుఁదమకములు నీవే యెరుఁగుదువూ

చ. 1: యెన్నఁడొకో నీవు నన్ను యెనసి మన్నించేది‌
       చన్నుల నే నిన్ను నొత్తి సాధించేది
       వున్నదాన మేడమీఁద నొంటి నేఁ బొడవునను
       సన్న సేసేవు నీ వైతే సారెకు దిగువను

చ. 2: యెప్పుడొకో నా మేను యిటు నీ మేను సోఁకేది
       అప్పటి నే మారుకు మా రప్పళించేది
       కప్పురపుబాగాలు కట్టివేసితిని నీపై
       నెప్పున నందుకొంటివి నిచ్చె నెక్కి నీవూ

చ. 3: యేవేళకో నామంచ మెక్కి నీవు గూచుండేడి
        తావుల నేనె నిన్ను దక్కఁ గొనేది
        శ్రీవెంకటేశ్వర నిన్ను చేవట్టి యెక్కించుకొంటి
        మావి యిచ్చి కూడితిని ముచ్చటతో నీవు