పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0323-4 శుద్దవసంతం సంపుటం: 11-136

పల్లవి: వేవేలు జాగు లిఁక విడవయ్యా
         యీ వేళ నాకుఁ జన వియ్యవయ్యా

చ. 1: శిర సేల వంచేవు సిగ్గు లేల పెంచేవు
       సొరిది మా వంక నిటు చూడవయ్యా
       మరిగి యున్నదాన మాయ లెల్ల విన్నదాన
       యిరవు నేయఁగ నిక నేఁటి కయ్యా

చ. 2: యేడ పరాకై వున్నాఁడ వేమి దలఁచుకొన్నాఁడ
       వాడఁగలమాట లెల్ల నాడవయ్య
       మేడెపువల పిదివో మెత్తనిపర పిదివో
       వాడిక నీమేలు నాపై వంచవయ్యా

చ. 3: చెక్కు లేల నొక్కేవు చెంది యేల చొక్కేవు
        పక్కన యింటిలోనికిఁ బదవయ్యా
        యిక్కువ శ్రీవెంకటేశ యెనసితి వింకా నాస
        నిక్కీ నాకు నన్నిట్టె మన్నించవయ్యా