పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0323-2 దేసాళం సంపుటం: 11-134

పల్లవి: ఏమి చూచుకొన్నాండవో యెఱఁగ నేను
         కామించి నీ మన్ననలో కడమలూఁ గానము

చ. 1: దవ్వుల నుండిననన్ను దగ్గరఁ బిలుచుకొంటే
       చివ్వన నీకు మేలు చేరదా నేఁడు
       రవ్వగానీ కొలువులో రాజసమె చూపఁగాను
       యివ్వల నవ్వల నీవు యేమి గట్టుకొంటివి

చ. 2: దట్టపువిరహి నన్నుఁ దప్పక చూచితేను
       అట్టె దయ గలవాఁడ వని మెచ్చనా
       గుట్టుతోడ నిందరిలో కొంచి కొంచి నవ్వఁగాను
       యెట్ట నెదురుకట్ల నందు కెక్కెఁ బనులు

చ. 3: యింటిలో నుండిననన్ను యిటు నీవు గలసితే
       జంట వై పొందులు సేయ జాణవు గావా
       అంటితివి శ్రీవెంకటాధిప తెరలో నన్ను
       వెంట వచ్చి కూడితిని వింత లాయఁ జేతలు