పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0322-6 నాదరామక్రియ సంపుటం: 11-132

పల్లవి: మన మెఱిఁగినవె మాయ లిన్నియును
          వెనకసుద్దు లెంచితె వేవేలుఁ గలవూ

చ. 1: మొగము చూచితిఁగా మొక్కితిఁగా నీకు నిట్టె
       జగడా లింకా నేల చాలించు
       తగవు చెప్పకు మింక తడవ నే నా సుద్ది
       వగ లెన్నైనాఁ గలవు వడిఁ దప్పించుకోనూ

చ. 2: నెలవి నవ్వితిఁ గా చెప్పినట్టె వింటిఁ గా
       చలము లింకా నేల చాలించు
       బలిమి నేయకు మింక పంతము లిచ్చితి తొల్లె
       వలపు రేఁచఁగ బోతే వసము గా దిఁకనూ

చ. 3: కన్నుల మెచ్చితిఁగా కాఁగిట నించితిఁగా
       సన్నలు చాయలు నిఁకఁ జాలించు
       వున్నతి శ్రీవెంకటేశ వొద్ది కైతి నీతోను
       వన్నెలు వాసులు నెంచ వలెనా యిందులోనూ