పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0321-1 మంగళకౌశిక సంపుటం: 11-121

పల్లవి: పడుచుఁజేఁతలు గావు బాలకృష్ణుఁడు
         తొడికీ మోవిపంటికె దుండగపుఁగృష్ణుఁడు

చ. 1: వెన్న చేతఁ బట్టుకొని వేలు చాఁచి వుట్లకు
       సన్న చేసిఁ గదవమ్మ జాణ కృష్ణుఁడు
       కన్నెలు ద న్నెత్తుకొంటె కాఁగిటిచూవులు చూపీ
       యెన్నిట తా నసకాడె యీ కృష్ణుఁడు

చ. 2: అంకెల దొంగెడు తానె అందపుచూపులు చల్లీ
       లంకె మగనాండ్లపై లలిఁ గృష్ణుఁడు
       పొంకపుచెక్కు గీఁటితె పుక్కిట లోకాలు చూపీ
       సంకె లేక యశోదకు సటకాఁడు కృష్ణుఁడు

చ. 3: గొల్లెతలు ముద్దాడితె గురుతు లెల్లా నించె
        చల్లచాడెలకాడనె సరి గృష్ణుఁడు
        అల్ల శ్రీవెంకటాద్రిని అదె తుంగభద్రదరి
        కొల్లలుగా వరా లిచ్చీ గోవిందకృష్ణుఁడు