పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0320-5 ఆహిరి సంపుటం: 11-119

పల్లవి: ఇట్టుండ వలదా నీవు యెవ్వతెకు మోహించినా
         దట్టముగ నిచ్చితేను తప్పవు నీ బాసలు

చ. 1: ఆపెమాట లైనా నీవు ఆలకించి మా యింటికి
       యీ పొద్దు విచ్చేసితివి యెన్నికె గాను
       దాపగు సవతులకు దయ పుట్టఁగాఁ గదా
       కాపాడితి విఁక నిన్ను కంటిమి నీ గుణము

చ. 2: అండ నుండి ఆపె నీకు అప్ప ణియ్యఁగా నైనా
        గుండె వట్టి నావద్దఁ గూచుండితివి
       దండిగ తోడివారు తగవు నడపఁగాఁగా
       నిండ నన్ను మన్నించితి నెగెడె నీ పుణ్యము

చ. 3: మొక్కిన యాపెమొక్కు మొగిఁ జిత్తానఁ బెట్టైనా
        గక్కనఁ గాఁగిటఁ గూడి కైకొంటివి
        దిక్కై శ్రీవెంకటేశ యిందిరకు సెలవుగఁగా
        మిక్కిలి న న్నేలితివి మెరసె నీ కీరితి