పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0320-4 గుండక్రియ సంపుటం: 11-118

పల్లవి: సారె నిన్ను వేసరించ సంగతే నాకు
         మారాడ నే నాలిసొమ్ము మగనిదె కాదా

చ. 1: నిన్ను వేగిరించేనా నీవె యెఱఁగవా
       కన్నుల మొక్కితేఁ దానె కరఁగేవు
       చన్నులె గొప్పలు గాని సరి నడుము బడలె
       విన్నపము లిఁక నేల వింతదానఁ గాను

చ. 2: చలము సాధించేనా జాణఁడవు గావా
        నిటుచుండఁగాఁ గరుణించేవు నీవె
        లలిఁ గొప్ప గొప్పగాని లాచి మోము చిన్నఁబోయ
        బలిమి చూపఁగ నీతో బంతగత్తెనా

చ. 3: నింద వేసేదాననా నీవు శ్రీవెంకటేశుఁడ
        వందాలు సేసుకోఁగానె ఆదరించేవు
        కందవకన్నులె గొప్ప గాని పాదాలు సన్నాలు
        మందలించి నీతో మారు మలయంగఁ గలనా