పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0319-5 మధ్యమావతి సంపుటం: 11-113

పల్లవి: ఎంతటిదానవు నీవు యేమి చెప్పేము
         పంతము లన్నియు దక్కెఁ బలుకు లీడేరెను

చ. 1: చింత లెల్లఁ బెడబాసె చెక్కుచెయి దియ్యవమ్మ
       కాంతుఁ డింటికి విచ్చేసె కడమ దీరె
       దొంతి నున్నవలపులు తొడికితేఁ జేతఁ జిక్కె
       యింతయు నీ మహిమలె యిఁక నేల జాగులు

చ. 2: కోరికలు సమకూడె గోరివాఁత మానవమ్మ
        గారవించె నాతఁడు నీ కైవస మాయ
        చేరినట్టె జవ్వనము చెల్లుబడి కెక్కె నిదె
        నేరు పెల్ల నీ సొమ్మె నీ కేల మరఁగు

చ. 3: తతి వచ్చె కూటమికి తలవంచ నేలమ్మ
       అతఁడు శ్రీవెంకటేశుఁ డంకెం గలసె
       మతిలోని ముదములు మాటలసోన గురిసె
       చతురత నీ పాలాయ సంకేల నీకును