పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0319-3 బౌళి సంపుటం: 11-111

పల్లవి: అన్ని నేరిచినవాఁడ వామీఁదు నేరవా
         సన్న నేసినవాఁడవు చాయకు రా నేరావా

చ. 1: కాయ మంటినవాఁడవు కప్పురము నోటి కిచ్చి
       ఆయములు గరఁగించ నంత నేరవా
       సోయగపుచూపులఁ జూచినవాఁడవు నీవు
       పాయపుకోరికె లిచ్చి పచరించ నేరవా

చ. 2: నగినవాఁడవు నీవు నానారీతుల నాతో
        అగపడి సరసము లాడ నేరవా
        మిగుల నాచేఁతలతో మించినవాఁడవు యిట్టె
        బిగువుఁగాఁగిటఁ గడు ప్రేమ రేఁచ నేరవా

చ. 3: మెచ్చినట్టివాఁడవు మేకులు సేసి నేసి
       యిచ్చగించి కలయఁగ నింత నేరవా
       కుచ్చి శ్రీవెంకటేశుఁడ కూడి మన్నించితి విదె
       నిచ్చలు నీమేలు నాపై నెరపఁగ నేవరా