పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0318-2 దన్నాసి సంపుటం: 11-104

పల్లవి: నీవు చేసినది చేఁత నీకు నడ్డమాడ నేను
         పావన మైతిని నీపాలిదాన నేను

చ. 1: యిందరు నెరఁగ నన్ను నిటు మన్నించిన నీవు
       మందలించి యిఁక వేరె మానఁ బొయ్యెవా
       పొందిన నా పొందు లివె పూఁచి నా మన సుండఁగ
       సందేహ మింక నేల సత మైతి నేను

చ. 2: కావలె ననుచు నన్నుఁ గైకొన్నఁవాడవు
       వేవేలైన దగ విడిచేవా
       నీ వేలివుంగర మిదె నేఁడు నాచేఁ జిక్కినది
       దావతి యిఁక నేఁటికిఁ దగు లైతి నేను

చ. 3: కచ్చుపెట్టి నీవు నన్నుఁ గాగిలంచినవాఁడవు
        యిచ్చకమె నేతు గాక యెర వయ్యేవా
        నిచ్చలు శ్రీవెంకటేశ నీకూటమి నాకు నబ్బె
        మచ్చుమాయ లిఁక నేల మరిగితి నేను