పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0317-6 ముఖారి సంపుటం: 11-102

పల్లవి: నీవుసేసిన బాలు నీ వెరఁగవా
         రేవగలు నెట్టు వేసరించేము నిన్నును

చ. 1: ఆడినప్పటి మాటలో నర్తము నీ వెరఁగవా
       యీడకు వచ్చుండఁగాను యిం తెరఁగవా
       వేడుక పడ్డవాఁడవు వెలయించ నెరఁగవా
       తోడనెని న్నెందాఁక దూరేము నిన్నును

చ. 2: నవ్విననవ్వులలోని నయము నీ వెరఁగవా
       రవ్వ సేసినఁవాఁడవు రా నెరఁగవా
       జవ్వనపువాఁడ వాసలు నీ వెరఁగవా
       రివ్వలుగ నెందాఁక రేచేము నిన్నుము

చ. 3: యిట్టె చూచినవాఁడవు యిచ్చక మెరఁగవా
        జట్టి గొన్నవాఁడవు మెచ్చ నెరఁగవా
        నెట్టన శ్రీవెంకటేశ నీవె నన్నుఁ గూడితివి
        గుట్టుతోడ నెందాఁకా కొసరేము నిన్నును