పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0317-5 హిందోళవసంతం సంపుటం: 11-101

పల్లవి: కడు ముద్దరాలు గన కక్కసించ నోపదు
         వడిఁ బెట్ట కిఁక నిట్టె వర మియ్యవయ్యా

చ. 1: నిన్నుఁ జూచి నవ్వు నవ్వి నివ్వెరగుఁ బొందెఁ జెలి
       సన్నలు నీకే తెలుసు సరసుఁడవు
       విన్నపము నేనే నంటె వెలది చిత్త మెఱఁగ
       వున్నతి చెలి మోహము వొప్పు గొనవయ్యా

చ. 2: అప్పసము చేయి చాఁచి ఆయములు గరఁగె యీ
        చొప్పు నీవె యెరుఁగుదు సుజాణఁడవు
        అప్పటిఁ గొసరే మంటె ఆపెమర్మ మెరఁగము
        చిప్పిలువయసు నీకే సెలవు సుమ్మయ్యా

చ. 3: మేరతో దగ్గరుతానె మెచ్చె నిన్నిటా నీకె
        ఆ రతి నీ వెరుఁగుదు వధికుఁడవు
       కూరిమి శ్రీవెంకటేశ కూడితివి మగువను
       నేరుతుమా నే మంత నీనే రక్షించవయ్యా