పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0031-3 భైరవి సంపుటం: 06-180

పల్లవి:

ఏటిపొందుయేఁటి గుణము యేటి సవరందనముమనసు
నాఁటుకొలుపం జేయలేని నటన లేఁటికే

చ. 1:

చూపు చూపు తారుకాణ చూపులోని నగవులెల్ల
చూపి పులకరించ లేని సొబగు లేఁటికే
యేఁపు రేఁగి కోరికలకు యెత్తు సేసి మీదఁ మీద
తాప మందఁజేయలేని తనువు లేఁటికే

చ. 2:

కదిసినపుడే మేను మఱచి కౌఁగిలించినట్టి చేయి
వదలి కన్ను ముయ్యలేని వలపు లేఁటికే
తుదలనైన చెమటగముల తొప్పఁదోఁగి మోహరతుల
సదమదముగఁ దనుపలేని చనవు లేఁటికే

చ. 3:

దేహధారి యైనఫలము తెలిసి వేంకటాద్రి విభుని
మోహ మందఁజేయలేని మురిప మేఁటికే
ఊహ దలఁచి తమక మంది వొకరి కొకరు యిట్లు నేఁడు
సాహసించి కలయకున్న జన్మ మేఁటికే