పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0040-1 దేశా(సా)క్షి సంపుటం: 06-166

పల్లవి:

అటువంటి వైభవము లమరఁ జేసినదైవ
మిటువంటియోగంబు లిన్నియును జేసి

చ. 1:

జలజాక్షి లావణ్య జలధి నుప్పొంగింప
నలివేణి ముఖచంద్రుఁ డభ్యుదయమాయ
కలికి వలరాయఁడను కాలకూటంబుతో
దలకొన్న యధరామృతంబు జన్మించె

చ. 2:

వనిత సౌభాగ్యంబువనధిలోపలఁ దోఁచె
గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు
తనివోనికోరికల తగుతురంగములతో
ననువైన విరహ బడబానలము గలిగె

చ. 3:

భామ యవ్వనమనెడి పాలజలనిధిలోన
వామాక్షియైన యవ్వనలక్ష్మీ గలిగె
యీమంచి తిరువేంకటేశ్వరుం డిందులోఁ
బ్రేమమున సుఖియించి పెంపొందఁగలిగె