పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0039-2 హిందోళవసంతం సంపుటం: 06-161

పల్లవి:

లలితాంగి యౌవనము లావణ్యముల ప్రోవు
అలరి యిటువలెఁ జేసనమ్మా

చ. 1:

జవ్వాది మిగుల నుష్ణము మీఁద సంపంగి
పువ్వు గట్టినది గన పొదలెఁ దాపంబు
నివ్వటిలు గొజ్జంగి నీట నొయ్యన కడిగి
దువ్వటపుఁ బయ్యెదను దుడువరమ్మా!

చ. 2:

మృగమదము గడు వేఁడి మెలుఁత తలపట్టునకు
అగలు గూడఁగ వేద నగ్గలంబాయ
బిగువైన కస్తూరి బేం ట్లొయ్యనగోరి
నగలించి తట్టుపునుఁ గంటరమ్మా

చ. 3:

విరహతాపంబునకు వేరొండు గతిలేదు
పొరసి వేగించినాఁ బోదు
తిరువేంకటాచలాధిపుని మన్ననఁ గాని
అరిది మోహము దీరదమ్మా!