పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0039-1 కాంబోది సంపుటం: 06-160

పల్లవి:

కుసుమ కోమలి విభునిఁ గొనియాడునెయ్యంపు
వసివాడు మోము నవ్వక నవ్వినట్లు

చ. 1:

చెలియ గుబ్బలమీఁది జిలుఁగుఁ బయ్యెద మెఱుఁగు
చలివెలుఁగు ననల దాఁచక దాఁచినట్లు
పొలఁతి మొలనూలి మొగపులదీప్తి సంసార
ఫల మిక్కడనుచు చూపక చూపినట్లు

చ. 2:

తరుణి కనుఁగొనల బిత్తరి చూపు విభుమీఁది
పరవశం బెల్లఁ జెప్పక చెప్పినట్లు
గరితవ్రేఁకపుఁగొప్పు గడలు లావణ్యంబు
సరసత్వ మెల్లఁ బెంచక పెంచినట్లు

చ. 3:

ఇంతి శ్రీ తిరువేంకటేశుఁ బొందినరతి
శ్రాంతి సౌఖ్యములు దలఁచక తలఁచినట్లు
కాంత లోఁ గొన్న మరుగతులు చెలులకుఁ దెలుపు
మంతనపు బాస పొడమక పొడిమినట్లు