పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0038-4 శ్రీరాగం సంపుటం: 06-158

పల్లవి:

పువ్వుల వలన నార పొదలి తలకెక్కిన
ట్లెవ్వరును నినుఁ గూడి యేపు మిగులుదురు

చ. 1:

చెలియకీ పెనుఁదురుము చీకటే వెలుఁగాయ
కలికి కనుఁగొనల తొలుకరి మెఱుపులా
వలనైన తెల్లగల వారి సంగడి నున్న
మలిన దేహులు కాంతి మహిమఁ జెందుదురు

చ. 2:

లేమకీనెన్నడిమి లేమే కలి మాయ
మోమునకు నెగురు కుచముల బరువున
కామించి పేదలును గలవారికడ నున్న
వేమారు సంపదల విఱ్ఱవీఁగుదురు

చ. 3:

జలజాక్షి చిత్తచంచలమే తిర మాయ
కెలసి నిన్నిట్ల కౌఁగిటఁ గలయఁగా
వెలుఁగొందు నిశ్చలులు వేంకటేశ్వరుఁడ నీ
చెలిమి వెడమ మతులైన సిరులఁ జెందుదురు