పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0038-3 కాంబోది సంపుటం: 06-156

పల్లవి:

ఏలరాఁడే చెలి నన్ను నెలయించి పచ్చవన్నె
చేలగట్టి పీలిచుంగు చెరిగినవాఁడు

చ. 1:

చీకటి మేని వాఁడు చెలువై నమణులకు
వేకటైన తరుణికి కూఁకటతో మగండు
రోఁకటి కైదువవాఁడు రోలఁ గట్టువడ్డవాఁడు
ఆఁకటికి పాలువెన్న లారగించేవాఁడు

చ. 2:

పంకజములోని యింతిం జంకంబెట్టి యంతఁబోక
అంకులచేతులవారి కాసచేసేవాఁడు
బింకపు రాకాసుల పేరుమాల్చినవాఁడు
వంకల వంకల మేన వన్నె వెట్టువాఁడు

చ. 3:

పాలవారియింటి పిన్న పాపఁడై తిరిగినాఁడు
గాలి దాగువాని మీఁదఁ గాలు సాఁచినాఁడు
పాలమీఁది కొండమిఁదఁ బల్లెగట్టిలోక మెల్ల
నేలుచున్నవాఁడు వేంకటేశుఁ డమ్మ యితడు