పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0038-2 కన్నడగౌళ సంపుటం: 06-155

పల్లవి:

మనసు తన పాలింటి మమకార భూతమై
అనయంబు నిన్నిటికి నాధార మాయ

చ. 1:

చూపులాసలఁ దగిలి సుఖయించఁ బోయినను
పై పైనె తలఁపులో పరితాప మాయ
తాపంబుం బరవశము తనువు సొగసిన మఱియు
నాపదల కన్నిటికి నది మూల మాయ

చ. 2:

తలఁపు లోపలి రతులఁ దమకించఁ బోయినను
తలఁపు వలపుల కెల్లఁ దగులాట మాయ
వలపులనియెడి మహా వైభవము వొడగనిన
నలపులును సొలపులును నతిఘనము లాయ

చ. 3:

కడు సొలసి శేషాద్రి ఘనుని దూరినయంత
అడరి యాతని కోప మగ్గలం బాయ
కడలేని కోపంబు కరుణారసముతోఁ
దడిసి యీపొందులకుఁ దరవుకాఁ డాయ