పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0037-6 భూపాళం సంపుటం: 06-153

పల్లవి:

లేని భ్రమ లుడిగి లేవయ్యా
లేనగుమోముతో లేవయ్యా

చ. 1:

చెంచెత కౌఁగిటఁ జెలఁగి వేడుకఁ బవ
ళించిన నాథుండ లేవయ్యా
పించెపుం బయ్యెదఁ బెనగి రతినిఁ జా
లించి యింతటను లేవయ్యా

చ. 2:

చక్కని శ్రీసతి చనుఁగవ సన్నపు
లెక్కలు వ్రాయక లేవయ్యా
పెక్కగు నమృతము పెదవికోమలికి
లిక్కిగఁ జేసితి లేవయ్యా

చ. 3:

ఏకాంతలో ని న్నెనసి తలఁచి రని
లేకలు వచ్చెను లేవయ్యా
శ్రీ కాంతుఁడవగు శ్రీ వేంకటనా
ళీకదళాక్షుఁడ లేవయ్యా