పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0037-5 ముఖారి సంపుటం: 06-152

పల్లవి:

ఇంతి చేసిన పూజ లిట్లుండెఁ దన హృదయ
మంతయును బూజించె నడియాసచేత

చ. 1:

చనుదోయి పూజించె జాజుఁబులకలచేత
కనుదోయి పూజించెఁ గన్నీటి చేత
మనసు పూజించెఁ బ్రేమపుఁ గోరికల చేత
తనువు పూజించెఁ బరితాపంబు చేత

చ. 2:

తలపు పూజించెఁ చింతాపరంపర చేత
అలపు పూజించె నొయ్యని పలుకుచేత
వలపు పూజించెఁ బొలయలుక చేతను నెంతే
సొలపు పూజించెఁ దన చూపరల చేత

చ. 3:

అనఘుఁ డీ తిరువేంకటాద్రీశు కృప చేత
వనిత సంభోగ పరవశముఁ బూజించె
తనివోని గుఱుతుచే తనవిలాసములచే
గనుపట్టఁ బూజించె గళమర్మములను