పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0037-2 శ్రీరాగం సంపుటం: 06-149

పల్లవి:

ఉదయాద్రి తెలుపాయె నుడురాజు కొలువిడె
అదనెఱిఁగి రాఁడాయె నమ్మ నా విభుఁడు

చ. 1:

చన్నులపై ముత్యాల సరు లెల్లఁ జల్లఁనాయె
కన్నులకుఁ గప్పొదవెఁ గాంత నాకిపుడు
కన్నెకలువల జాతి కనుమోడ్చినది మీఁద
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె

చ. 2:

పువ్వుల లోపలి కురులు బుగులుకొనఁగా నెఱసె
దవ్వులఁ దుమ్మెద గములు తరమి డాయఁగను
రవ్వసేయశుకపికము రాయడి కోర్వఁగరాదు
అవ్వల నెవ్వతెపసల కలరున్న వాఁడో

చ. 3:

పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి
చెన్నుగం గొప్పున విరులు చెరువం దురిమి
యెన్నంగల తిరువేంకటేశుం డిదె ననుం గూడె
కన్నులు మనసు నుం దనియం గరుణించెం గదవే