పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0037-1 భూపాళం సంపుటం: 06-148

పల్లవి:

తొయ్యలి భారపుఁ దురుమమరె
ముయ్యక మూసిన మురిపమున

చ. 1:

చందన గంధికిఁ జనుగుబ్బలపైఁ
జందెపు ముత్తెపు సరులమరె
చెందిన వేడుక చెలి నుపనయనము
జందెము వేసిన చందమున

చ. 2:

అంచగమనకును అలపుల నడపుల
ముంచిన మట్టెల మ్రోఁతమరె
పంచమ వేదము పంచసాయకుఁడు
చంచునఁ జాఱినచందమున

చ. 3:

బొట్టుగఁ గుంకుమ పొలఁతి నుదుటిపై
గుట్టుగఁ బెట్టిన గుఱు తమరె
రట్టడి వేంకటరమణునికౌఁగిటఁ
బట్టము గట్టిన భావమును