పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0036-6 శ్రీరాగం సంపుటం: 06-147

పల్లవి:

అప్పళించిన జవ్వాది యంటినమేనులతోడ
తొప్పం దోఁగు చెమటల దొరుగు టెన్నండురా

చ. 1:

చెక్కువట్టి కదలించి చిఱునవ్వుతోడి నోరు
నొక్కి కౌఁగిలించి నోరునోరు గదియించి
అక్కిలివొయ్యనిమాట లాడి పేరుకొని తిద్ది
మక్కువ దలంచి మేను మఱచు టెన్నండురా!

చ. 2:

ఉరముపై చనుగుబ్బ లూఁది పులకలు నించి
సరిలేని యధరము సారెసారెయు నాని
సిరిగల కొనగోరు సిరసు పై నొత్తియొత్తి
సుర వైభవముల జొక్కు టెన్నండురా

చ. 3:

చాలియుం జాలని యట్టి సౌఖ్య సంపదలచే
తేలగిలెడికన్నుల తెలివాలుఁ జూపుల
యీలాగు తిరువేంకటేశుండు మనకు నబ్బి
నీ లోపల నేఁగలసి నీవౌట యెన్నండురా!