పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0035-5 వరాళి సంపుటం: 06-140

పల్లవి:

కలిగెంగా నేఁడు కాంతకు లోని
వలవంత సొలపులే వరునిసన్నుతులు

చ. 1:

చెలువపు విభునిఁ జూచిన కన్నులకును
మలయు లేఁగురులే చామరతతులు
కలికి రమణునిఁ బొగడిననోరికిని
అలము నిట్టూర్పులే ఆలవట్టములు

చ. 2:

సిరులందు విభుని డాఁచిన తలంపునకు
అరిది తలంపులే పాయనిపూజలు
పరువంపుఁబతి నాసపడిన గుబ్బలకు
అరవిరి చెమటలే అభిషేకములు

చ. 3:

వెంకటపతితో నవ్విన నవ్వులకును
అంకెలమోవి తియ్యని బోనము
జంకించి యితనిపైఁ జూఁచు బొమ్మలకు
బింకపునటనలే ప్రియములగములు