పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0034-1 శ్రీరాగం సంపుటం: 06-130

పల్లవి:

ఏటితమకమే నా కింకను విని
నాటకములు బడి నమ్మిన వెనక

చ. 1:

చెల్లఁబో యేలే నాచెలువము వీని
వొల్లనిమేనితో నుడుకుచును
వెల్లాయ మేలే నావిభవము వీని
చల్లఁగౌఁగిలి జడిసిన వెనుక

చ. 2:

పొలిఁతి నా కేలే యీపొందులు వీని
అలయింతవలపుల నలయుచును
చెలియ నాకేలే యీసిరులు వీని
తలఁ పంతకాఁకలం దగిలిన వెనుక

చ. 3:

కదిసి నా కేలే యీగరువము వీని
పొదలుంబరవశానఁ బొరలుచును
ఇదివో శ్రీ వేంకటేశుండు వీని
యుదుటుంగూటముల నే నోసరినవెనుక