పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0033-1 హిజ్జజి సంపుటం: 06-124

పల్లవి:

ఇయ్యింతిమురిపెము యెట్లుండెనే
ఒయ్యారముతో నొరపోలికనో యనఁగా

చ. 1:

చక్కని రమణి గుబ్బ చనుదోయి కడు నిండి
యెక్కువ మద నరేఖ లెట్లుండెనే
అక్కరతో సతి హృదయమున వలపు విత్త
దుక్కిగా మరుఁడు గోళ్ళ దున్నించె ననఁగా

చ. 2:

లలనకుంబులక మొలకలపైఁ జమటలు
ఎలనవ్వుం జెక్కులపై నెట్లుండెనే
వలపను నునుంబైరు వాడకుండా మదనుండు
నెలవుగాఁ బైపైనె నీరు నించె ననంగా

చ. 3:

అందపు నెఱులలోన నలరురేకులు జాఱి
యిందువదనకుం దురు మెట్లుండెనే
కందువ వెంకటపతి కౌఁగిటి పరవశాన
వందులేక పండి కైవ్రాలెనో యనంగా