పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0032-5 ఆహిరి సంపుటం: 06-121

పల్లవి:

బడలివున్నాఁడు ఉప్పరిగలోన గుట్టు
విడిచి విభునిం జేర వచ్చేయవె

చ. 1:

చిలుకు నీనగవులే చిలుపాలు నీ
పలుచని నీ తెలి చూపుం బాశాలు
చలివేఁడికసరులే శాకాలు యింపు
దొలఁచి నీపతికి విందులు వెట్టవే

చ. 2:

జడియు నీ చెమటలే జలకాలు నీ
కడుమంచి మెయితావి గందాలు
వెడయూర్పు విసరులే విభవాలు నీ
పొడముఁ బలుకుల తప్పులు వాపవే

చ. 3:

కమ్మని నీమాటలే కప్పురాలు నీ
తమ్ములపుంజెదరులే తలఁబ్రాలు
నెమ్మది వేంకటగిరి నిలయుని నీవు
క్రమ్మఱం గ్రమ్మర నిట్టే కౌఁగిలించవే