పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0032-3 ముఖారి సంపుటం: 06-119

పల్లవి:

ఏమి సేయఁ గలమయ్య యేలికయ్య
సోముని కళల మోము చూడకుంటేఁ జూడవు

చ. 1:

చెలి చక్కనిది గాదో చిత్త మేమి రాదో
కొలఁది మీఱిన నీపై కూరిమి లేదో
ఎల జవ్వనము కొల్ల లీదో వాదొ
ఒలసీనొల్లముల నీ వొల్లకుంటే నొల్లవు

చ. 2:

మరుఁ డేమి మతిలేఁడొ మఱచి వున్నాఁడొ
గరిమల విలుకాఁడు గాఁడో లేఁడో
దొరకుం జెఱకు విల్లు తూఁడో యేఁడో
సిరుల నీచిత్త మిది చేరకుంటేఁ జేరదు

చ. 3:

మ్రొక్కనిదే చలమో మోహ మేమి ఖిలమో
పక్కం బాసినందు కేమిఫలమో
యెక్కువ వేంకటరాయ యేతులేని పొలమో
మిక్కిలైతి విందాఁక మెచ్చకుంటే మెచ్చవు