పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0032-2 ఆహిరి సంపుటం: 06-118

పల్లవి:

చక్కని బోయ జవరాలు మించు
చెక్కుపై చేతితో చెలి దూరే నిపుడు

చ. 1:

చింతచిగురుదెచ్చి చెలువైన వలపుల
సంతనమ్మిన బోయ జవరాలు
కంతుగురుఁడ నిన్నుఁగలయంగఁ దలపోసి
చింతచిగురుచేతఁ జిమిడే నిపుడు

చ. 2:

కిన్నర కులుకుల కెరలి జారెడి గుబ్బ
చన్ను మూయదు బోయ జవరాలు
వెన్నుఁడ నినుఁ బాసి వెడమాయ కోవిల
కున్నల కులుకులు గులికే నిపుడు

చ. 3:

వల్లెవాట్లతోడ వడిఁ బెద్దకన్నుల
చల్లుఁ జూపులబోయజవరాలు
నల్లని తిరుమల నాయని కౌఁగిట
చల్లని చూపుల జంకించె నిపుడు