పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0060-6 సామంతం సంపుటం: 06-114

పల్లవి:

అందుకే వెఱచేనో యమ్మలాలా తన
కందువకే పారంబోయి కాలుజారె బిడ్డండు

చ. 1:

పాలకడవలును బానలవెన్నలును
ఓలిం బెట్టి వుట్లపై నుండంగాను
నేలనుండి యెగసి నిక్కితీసె నిదివో
పాలు గాసు సేయ విడి పడఁబోయె బిడ్డఁడు

చ. 2:

కమ్మని నేతులును గడ్డల జున్నులును
కమ్మి వెద్దకాఁగులతో కాఁగంగాను
దిమ్మరియై తొడికి తియ్యం బోయీ నిదివో
అమ్మరో వ్రేళ్లు పొక్కి అగ్గిదాఁకి బిడ్డఁడు

చ. 3:

కోడెలఁ బేయలను కూడఁగట్టి విడిచి
వోడక వీథులం బరువులు దోలీని
వేడుక కాఁ డిదెవో వేంకటేశ్వరుఁడు
ఆడకు నీడకుఁ బాఱి అలసీని బిడ్డఁడు