పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0059-4 సామంతం సంపుటం: 06-106

పల్లవి:

పొద్దు వోయె నింక నేల బూమెలు, యింత
వద్దు నీకు సింగారాలు వచ్చేవొ రావొ

చ. 1:

పల్లవపు బరపుపై పవ్వళించు చెలిలాగు
తల్లడ మయ్యెడి నేము దలఁచినా
చొల్లెపుఁజుట్లే నీకుఁ జుట్టబట్టె నింతవడి
వల్లడి వలపు కాఁడ వచ్చేవొ రావొ

చ. 2:

పొడలు వెట్టుచునున్న పొలఁతిభావము చెప్ప
తడఁబడె నాలిక తమకాన
కడు ముత్యపుఁ బేరులె కట్టఁబట్టె మెడనిండ
వడచల్లు చూపుకాఁడ వచ్చేవొ రావొ

చ. 3:

యింతి మేనిపరితాప మింతేసి నే మెఱింగింప
పంతానికె విచ్చేసితి ఫైకొని
కంతునిగురుఁడ వేంకటరాయ యిటమీఁద
వంతఁబెట్టక యిట్టె వచ్చేవొరావొ