పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0059-2 రామక్రియ సంపుటం: 06-104

పల్లవి:

విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా
మచ్చిక మరుని ఢాక మగువ నీ రాక

చ. 1:

పంచల పసిండి నిగ్గు వచ్చిదేరే సిగ్గు
వంచన వలపు తీపు వాలుక చూపు
కంచపుంబాలకూడు కాఁకలనీవాడు
మంచపు నీ తలఁబ్రాలు మట్టెల పాదాలు

చ. 2:

కోవిల కొసరుఁబాట కొమ్మరో నీ మాట
తావులచెంగావి నీ తళుకు మోవి
గోవ జవ్వాదికరంగు గుబ్బల నీ మెఱుంగు
భావజు దాడి రొదలు పాదపు నీ కదలు

చ. 3:

ముద్దుల నీ నగవు చిమ్ముల రతి బిగువు
అద్దలింపుఁ గసరు మోహంపుఁ గొసరు
గద్దరి నీ యలపు వెంకటపతి తలఁపు
అద్దపునీమోము మోహనరతిసాము