పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0058-6 కాంబోది సంపుటం: 06-102

పల్లవి:

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద
గొప్పగొప్ప కన్నుల గోవిందరాజా

చ. 1:

పవ్వళించే వీడ వచ్చి పాయనినీయలపెల్ల
మువ్వంక మే నితోడ ముచ్చట దీఱ
నవ్వేటి శ్రీ సతి చూపు నాటిన చిత్తపుమేన
క్రువ్వనికలువదండై గోవిందరాజా

చ. 2:

నిద్దరించే వీడ వచ్చి నిలుచున్నయలపెల్ల
ప్రొద్దువొద్దునకుఁ దీర భోగీంద్రుపై
యిద్దరు సతులు నీకు నేచిన తాళగతుల
గుద్దేటి పాదములతో గోవిందరాజా

చ. 3:

మెండుగ మేలుకొంటివి మించిన కౌఁగిటిలోన
కొండుకపాయపుసిరి కోపించంగా
ఉండవయ్యా సుఖలీల నుడివోనిప్రియముతో
కొండలకోనేటిరాయ గోవిందరాజా